పమిడిముక్కలలో కానిస్టేబుల్ పై దాడి ఘటన దారుణమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మర్రు అసెంబ్లీ పమిడి ముక్కల మండలంలో మట్టి మాఫియా ఆగడాలను ఫోటో తీసినందుకు కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగలగొడతారా..? అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. మట్టి మాఫియాకు ప్రభుత్వం అండగా ఉండడం వల్లే కానిస్టేబులుకు రక్తమోడేలా గాయాలయ్యాయని ఆయన ఆరోపించారు.
ఈ ప్రభుత్వం ఎవ్వరినీ ఉద్యోగం సజావుగా చేయనివ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా కారణంగా మహిళా తాసీల్దారుపై దాడి జరిగిన సంఘటన విధితమేనని, ఈ ప్రభుత్వం మట్టి మాఫియాతో పోలీసులుపై దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.