పొత్తుల విషయంలో వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తూ టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేయడం తెలియదని, పొత్తు లేకపోతే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరని ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో వైసీపీ నేతల కామెంట్లపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైసీపీ పక్కన నిలబడేందుకు ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదని వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదని ఆరోపించారు.
గోదాట్లో కొట్టుకుపోతున్న గ్రామం సింహం తోక ఎవరూ పట్టుకోరనే నిజాన్ని వైసీపీ కప్పిపెడుతోందని సోమిరెడ్డి విమర్శలు చేశారు. వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకపోవడం కాదు.. ఆ పార్టీతో చేయి కలపడానికే ఎవరూ సిద్ధంగా లేరన్నారు. సింహంలాగా ఒంటరిగా వస్తామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం చూసి జనం నవ్వుకుంటున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ తన తండ్రి వైఎస్ఆర్ కంటే గొప్పవాడేమీ కాదని.. వైఎస్ఆర్ గతంలో పొత్తులు పెట్టుకోలేదా అని వైసీపీ నేతలను సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
