Somireddy Chandramohan Reddy: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. జగన్ పాలనలో పంటలపై పెట్టుబడితో పాటు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. హెక్టార్ పత్తికి రూ. 15 వేలు, అరటికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 15 వేల పరిహారం అందించి ఆదుకున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇచ్చామని సోమిరెడ్డి వివరించారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం విపత్తు సమయంలో ఆదుకోవాల్సి ఉండగా పూర్తిగా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
Read Also: 108 Services: ఏపీలో పనిచేయని 108 సర్వీస్.. మరి ఏ నంబర్‌కు కాల్ చేయాలి?
వైసీపీ ప్రభుత్వం విపత్తుల సాయాన్ని అరకొరగా అందించి చేతులు దులుపుకుంటోందని సోమిరెడ్డి మండిపడ్డారు. గతంలో పనిచేసిన మంత్రి కన్నబాబు వ్యవసాయశాఖను సగం మూసేశారని… కాకాని గోవర్ధన్‌రెడ్డి వచ్చాక పూర్తిగా మూసేశారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఆక్వా రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. తాము మూడు రాజధానుల విషయాన్ని అడిగితే వారు ఆఫ్రికాతో పోలుస్తారని.. తాము ఏపీని శ్రీలంకతో పోలిస్తే మాత్రం బుకాయిస్తారని కౌంటర్ ఇచ్చారు. గత మూడేళ్లలో రైతులకు ఎకరానికి 12 వేల నుంచి 15 వేలకు పెట్టుబడి ఖర్చు పెరిగిందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా అని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.