ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. ఫిబ్రవరి 14 వరకు ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. మళ్ళీ ఢిల్లీ రావడం సంతోషంగా ఉందన్న ఆయన తనకున్న అనుభవం ద్వారా రాష్ట్ర పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తా అన్నారు.
ప్రధాన మంత్రి గతి శక్తి యోజన లో భాగంగా తెలంగాణ లో 5 కారిడార్ ల అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో 898 కిలోమీటర్లు 26 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సోలాపూర్ కర్నూల్ చెన్నై… తెలంగాణలో 77 కిలోమీటర్లకు 1069 కోట్లు ఖర్చవుతుందన్నారు. హైదరాబాద్ విశాఖ కారిడార్ తెలంగాణ లో164 కిలోమీటర్లకు రూ.4308 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ రాయపూర్ ఎకనామికల్ కారిడార్ 116 కిలోమీటర్లకు 3176 కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. నాగపూర్ విజయవాడ 290 కిలోమీటర్లు 2 790 కోట్లతో అభివృద్ది చేస్తామన్నారు.
నేను పార్టీ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇవాళ సోనియా గాంధీకి లేఖ రాస్తున్నానని, రాజీనామా రెండు మూడు రోజుల తర్వాత చేస్తానన్నారు. పీసీసీ, ఇంఛార్జి టాగూర్ కి విన్నపం నన్ను పార్టీ నుండి బయటకు పంపండి అన్నారు. నేను బయటకు పోతే మీకు మంచిది..నాకు మంచిది. నేను స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నా అన్నారు. నాపై కోవర్ట్ అనే ముద్ర వేయడం నాకు నచ్చలేదు. మంచోడు అనకపోయినా సరే.. కోవర్ట్ అనే దుర్మార్గం పేరు వద్దు. సోషల్ మీడియా లో నన్ను కోవర్ట్ అని ఎవరు రాయిస్తున్నరో తెలుసన్నారు జగ్గారెడ్డి.
చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయనను శాండల్ వుడ్ లో కళా తపస్వి అని కూడా పిలుస్తారు. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా 89 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజేష్ ఫిబ్రవరి 9 నుండి వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా బెంగుళూరులోని ఓ ఆసుపత్రి చేరి చికిత్స పొందారు. డాక్టర్లు అనేక ప్రయత్నాలు చేసినా ఆయన్ని కాపాడలేకపోయారు.
తమిళనాడులో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నటుడు విజయ్ తన ఓటును వినియోగించుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన విజయ్ ఫోటోలు తీసేందుకు మీడియా పెద్ద ఎత్తున గుంపులుగా చేరడంతో అక్కడ ఉన్న సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. దీంతో పరిస్థితిని గమనించిన విజయ్ తనవల్ల జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. హిజాబ్ ఆందోళనలో పాల్గొన్న 58 మంది విద్యార్థులను శివమొగలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదట నుంచి హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు.మరోవైపు ముస్లిం వస్త్రధారణలో హిజాబ్ భాగం కాదని ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లలో యూనిఫామ్ ధరించాలన్న గవర్నమెంట్ ఆర్డర్స్ రాజ్యాంగంలోని మత స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్చకు వ్యతిరేకం కాదని అడ్వకేట్ జనరల్ అన్నారు.