NTV Telugu Site icon

Shivratri Brahmotsavam 2023: శ్రీశైలంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam

Srisailam

Shivratri Brahmotsavam 2023: శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతుంటాయి.. శివరాత్రికి ముందే ప్రముఖ శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు మొదలవుతుంటాయి.. ఇక, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. ప్రతీ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.. శ్రీశైలంలో నేటి నుండి ఈనెల 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు.. ఇక, ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు..

Read Also: TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళే ఆ టికెట్లు విడుదల

బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇదే సమయంలో స్వామివారికి పాగాలంకరణ కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు సేవలు నిర్వహించనున్నారు. 11వ తేదీన ధ్వజారోహణ, 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. 19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక, ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలు భక్తులు తరలివస్తున్నారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. ఇటు ఏపీఎస్‌ఆర్టీసీ, అటు టీఎస్ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి.