Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా

  • సత్తెనపల్లిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు
  • చైర్మన్‌గా రామాంజనేయులు ప్రమాణ స్వీకారం
  • వైస్ చైర్మన్ పదవిపై టీడీపీ కౌన్సిలర్ల పట్టు
  • ఏకాభిప్రాయం లేక ఎన్నిక వాయిదా
Ap

Ap

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. పొత్తు ఒప్పందం ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలపై తలెత్తిన భేదాభిప్రాయాలు ఎన్నిక ప్రక్రియను నిలిపివేశాయి. దీంతో సత్తెనపల్లి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

చైర్మన్‌గా రామాంజనేయులు ప్రమాణం.. 

కూటమి పొత్తులో భాగంగా సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీకి, వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. జనసేన తరఫున వైస్ చైర్మన్ అభ్యర్థిగా దివ్యవాణి పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో అధికారులు టీడీపీ నేత రామాంజనేయులును మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే జనసేన అభ్యర్థి దివ్యవాణి వైస్ చైర్మన్‌గా ప్రమాణం చేయాల్సి ఉంది.

టీడీపీ కౌన్సిలర్ల పట్టు.. ఓటింగ్ డిమాండ్‌తో వాయిదా

అయితే వైస్ చైర్మన్ పదవి విషయంలో టీడీపీ కౌన్సిలర్లు భిన్న స్వరం వినిపించారు. తమ పార్టీకి చెందిన నారాయణస్వామికే వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని వారు గట్టిగా పట్టుబట్టారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ రావడంతో, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు.