Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి సజ్జల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చేంత వరకు పేదలకు వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. మానవతా దృష్టితో ఆలోచించి వైఎస్ఆర్ తెచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ అన్నారు. పిల్లలకు మంచి చదువులు, రైతుల కోసం ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటివి వైఎస్ఆర్ తెచ్చారని సజ్జల గుర్తుచేస్తున్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ప్రస్తుతం జగన్ కొనసాగిస్తున్నారని కొనియాడారు. వైయస్సార్ హయాంలోని‌ పథకాలు ఇప్పుడు మరింత విస్తృతమయ్యాయని పేర్కొన్నారు.

మూడేళ్లలోనే పేదల అకౌంట్లలో నేరుగా లక్షా 62 వేల కోట్లు జమ చేశారని సజ్జల తెలిపారు. ఈ పరిణామం పేదల జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకుని వచ్చిందన్నారు. ఆకాశమే హద్దుగా పిల్లలను ఎంత వరకైనా చదివించటానికి జగన్ రెడీగా ఉన్నారని చెప్పారు. మూడేళ్లలోనే 30 ఏళ్ల సామాజిక అభివృద్ధిని జగన్ తెచ్చారని ప్రశంసించారు. మామకి వెన్నుపోటు పొడిచి సీఎం పదవి పొందిన వ్యక్తి చంద్రబాబు అని.. కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాయించడమే కాకుండా వ్యవస్థలను సైతం చంద్రబాబు మేనేజ్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు పేరు చేప్తే ఒక్క పథకం అయినా గుర్తుకువస్తుందా అని సజ్జల ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో దుష్టచతుష్టయం, వారి దత్తపుత్రుడు జగన్‌ను దెబ్బ కొట్టటానికి ప్రయత్నిస్తున్నారని.. ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు తమ మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకోవాలని సూచించారు. చంద్రబాబు పాలనలో విత్తనాల కోసం రైతులు క్యూల్లో నిలపడి ప్రాణాలు కోల్పోయారని.. వృద్ధులు ఫించన్‌ల కోసం పడిగాపులు కాసేవారని విమర్శించారు. బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగడానికి గతంలో పోరాటాలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. కానీ జగన్ మాత్రం పిలిచి మరీ పదవులు కేటాయించారని.. అన్ని వర్గాలనూ అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షం అంటే ప్రజలకు సేవ చేసేలా ఉండాలని.. అధికారంలో ఉన్నప్పుడు ఏ పథకాలు తెచ్చావని అడిగితే చంద్రబాబు చెప్పలేడన్నారు.

అటు వైసీపీ ఒక కుటుంబం లాంటిదని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చెట్టు ఉంటేనే కాయలు కోసుకోగలం, కూర్చోగలమన్నారు. కొప్పు ఉంటేనే పూలు పెట్టుకోగలమన్నారు. అందరితో కలిసి పని చేస్తామని.. .కలిసి వచ్చే వాళ్ళను కలుపుకునిపోతాం‌నని తెలిపారు. సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని.. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే జగన్ నడుస్తున్నారని ప్రశంసించారు.

Exit mobile version