టిడిపి, బిజేపిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ-బీజేపీ నేతలు జత కలిశారా అనే అనుమానం వస్తుందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ. 399 కోట్లు ఉన్నాయని… ఈ సీజనుకు సంబంధించి రూ. 1200 కోట్లు ఇంకా కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు వాటిని రిలీజ్ చేయించేలా చర్యలు తీసుకుని క్రెడిట్ తీసుకోవచ్చని.. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను మేము అనుసరిస్తున్నామని తెలిపారు. అభివృద్దిలో ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోందని.. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ లెక్కగట్టి హేతుబద్దంగా ఆస్తి పన్ను విధిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఆస్తి పన్ను పెంచి అమలు చేస్తున్నారని.. ఆస్తిపన్ను పెంపు వల్ల కేవలం రూ. 186 కోట్లు మాత్రమే ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని రైతాంగం పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్లమాలిన ప్రేమ కనపరుస్తున్నారని.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. రెండు, మూడు అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారని… సీఎంకు చంద్రబాబు రాసిన లేఖలో పూర్తిగా అబద్దాలు ప్రస్తావించారని మండిపడ్డారు. చంద్రబాబు సహజ స్వభావానికి అనుగుణంగానే ఆయన లేఖ కూడా ఉందని.. తన హయాంలో 48 గంటల్లోనే ధాన్యం సేకరణ సొమ్ము చెల్లించామని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేస్తోన్న ఆరోపణలపై ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలని.. మిల్లర్లు, వైసీపీ నేతలు కలసి ఎలా దోచుకుంటుందో చంద్రబాబు తెలపాలన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు విమర్శలు చేయవద్దని కోరుతున్నామని వెల్లడించారు.