Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: అందుకే బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం.. బరితెగిస్తాం అంటే చర్యలు తప్పవు..

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna Reddy: రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. విపక్షాలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే దురుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.. అయితే, ఆ జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు.. విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. దానిని చీకటి జీవో అనటంలో అర్ధంలేదన్నారు.. జీవోలోని నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదు వైసీపీకి కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు అస్సలే నిర్వహించకూడదు అనలేదు కదా? అని ఎదురుప్రశ్నించిన సజ్జల.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్స్‌లో సభలు నిర్వహించుకోవచ్చు అని సూచించారు.

Read Also: GVL Narasimha Rao: ఆ తర్వాతే కేసీఆర్‌ ఏపీలో అడుగుపెట్టాలి..!

ఇక, ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులపై పోలీసులకే విచక్షణాధికారం ఉంటుందన్నారు సజ్జల.. ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు పోలీసులు విపక్షాలకు సైతం ఇచ్చే అవకాశం ఉంటుందన్న ఆయన.. ఈ నిబంధనలు పోలీసు చట్టంలో ఉన్నవే అన్నారు. కందుకూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని.. ఇరుకు రోడ్లలో సమావేశాలు నిర్వహించి తొక్కిసలాటలో 8 మంది చనిపోవటం వల్ల కొత్త నిబంధనలు తీసుకుని రావలసిన అవసరం ఏర్పడిందన్నారు.. రోడ్ల నిర్మాణం ప్రయాణాల కోసమే.. కానీ, బహిరంగ సమావేశాల కోసం కాదన్నారు.. నిబంధనలు ఉల్లంఘిస్తాం, బరితెగిస్తాం అంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని విపక్షాలను హెచ్చరించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Exit mobile version