Site icon NTV Telugu

Sajjala: 99.8 శాతం హామీలు అమలు చేసినా విమర్శిస్తారు.. ఇదేం పద్ధతి?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala: ఈనెల 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారత కోసం ప్రయత్నిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన గొప్ప నాయకుడు అని సజ్జల కీర్తించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వంటి అన్ని రంగాల్లో జగన్ కీలక మార్పులు తీసుకువచ్చారని ప్రశంసలు కురిపించారు. రాజకీయ, ఆర్ధిక, సామాజిక సాధికారత తీసుకుని రావటాన్ని ఒక యజ్ఞంలా చేస్తున్నారన్నారు. గత మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో వచ్చిన మార్పును ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారని సజ్జల తెలిపారు. అభిమానం, ప్రేమతో జగన్ బర్త్ డే సందర్భంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.

Read Also: Ram Charan: అయ్యబాబోయ్.. హీరో రామ్‌చరణ్ వాడే వాచీ, షూస్ అంత ఖరీదా?

సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని చోట్లా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని సజ్జల తెలిపారు. ఇది సీఎం జగన్‌కు 50వ పుట్టినరోజు అని.. అందుకే ఇది ఎంతో ప్రత్యేకమైనదని అభివర్ణించారు. ఏపీలో సీఎం జగన్ అన్ని పాఠశాలల్లో తరగతుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేస్తున్నారని.. గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశాయా అని సజ్జల ప్రశ్నించారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం తగదని హితవు పలికారు. 99.8 శాతం హామీలు అమలు చేసినా విమర్శలు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారని.. వంద శాతం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారని.. ఇది పద్ధతి కాదని సజ్జల అన్నారు. ఒకవేళ వంద శాతం హామీలు అమలు చేస్తే.. ఇంత ఆలస్యంగా ఎందుకు చేశారని అడుగుతారని సజ్జల అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్నది ఆలోచించకుండా విమర్శలు చేస్తుంటారని ప్రతిపక్షాలను ఉద్దేశించి చురకలు అంటించారు.

Exit mobile version