Sai Priya And Ravi In Vizag Police Custody: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద కనిపించకుండా పోయిన సాయిప్రియ వ్యవహార తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే! బీచ్‌లో కొట్టుకుపోయిందేమోనన్న అనుమానంతో అక్కడ గాలింపు చర్యలు చేపడితే, సాయిప్రియ మాత్రం అందరికీ ట్విస్ట్ ఇస్తూ ప్రియుడు రవితో బెంగుళూరుకి వెళ్లింది. అక్కడ అతడ్ని వివాహం చేసుకొని, తనని వెతకొద్దని మెసేజ్ చేసింది. ఇప్పుడు ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బెంగుళూరులో సాయిప్రియ దంపతుల లొకేషన్ కనుగొన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని, విశాఖకు తరలించారు. అక్కడి నుంచి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
కాగా.. సాయిప్రియ (21)కు భీమవరం ప్రాంతానికి చెందిన శిరుగుడి శ్రీనివాసరావుకు 2020 జూలై 25వ తేదీన పెళ్లి జరిగింది. హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తోన్న శ్రీనివాసరావు.. భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న పెళ్లిరోజు కావడంతో.. రెండురోజుల ముందే భార్యాభర్తలు సాయిప్రియ ఇంటికొచ్చారు. కాసేపు సరదాగా గడపడం కోసం, అదే రోజు సాయంత్రం ఆర్కే బీచ్‌కి వెళ్లారు. ఇద్దరు కలిసి నీళ్లలోకి దిగారు. ఇంతలో శ్రీనివాసరావుకి మెసేజ్ రావడంతో ఒడ్డుకు వచ్చాడు. అంతే.. నీళ్లలో ఉన్న సాయిప్రియ, అట్నుంచి అటే మాయమైపోయింది. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందేమోనన్న అనుమానంతో భర్త శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం అందించాడు. సీసీటీవీ కెమెరాల్లో ఆమె జాడ కనిపించలేదు.
ఇంతలో మీడియాలో సాయిప్రియ సముద్రంలో గల్లంతయ్యిందన్న వార్తలు రావడంతో.. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. హెలీకాప్టర్లు, కోస్ట్‌గార్డ్ షిప్‌లు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రప్పించారు. కట్ చేస్తే.. సముద్రంలో మునిగిన సాయిప్రియ బెంగుళూరులో కనిపించింది. తన ప్రియుడు రవిని పెళ్లాడింది. చివరికి వారి ఆచూకీ తెలుసుకొని, విశాఖకు తీసుకొచ్చారు. శ్రీనివాసరావుకు, సాయిప్రియకు పెళ్లై రెండేళ్లయినా.. ఇంకా సంతానం కలగలేదని, దీనిపై వారిద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.