రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) తన అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నిజాం కాలంలో పురుడు పోసుకున్న ఈ ప్రగతి రథచక్రానికి ఇవాళ్టితో 90 ఏళ్ళు పూర్తయ్యాయి. జూన్ 15, 1932లో ఆర్టీసీ ఏర్పాటయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గా రూపాంతరం చెందింది. ఈ రథచక్రాలు పరుగులు పెట్టడం మొదలై నేటికి 90 వసంతాలవుతోంది. ఇప్పటికీ అలుపు, సొలుపు లేకుండా.. ఆర్టీసీ ప్రయాణమంటేనే సురక్షితం, సుఖవంతం అనే నినాదం వుంది.
నిజాంల కాలంలో 15, జూన్ 1932లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (NSRRTD) గా ఏర్పాటయింది. అప్పుడు కేవలం 27 బస్సులు, 166 మంది ఉద్యోగులు వున్నారు. తర్వాత 1958 లో APSRTC ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తదుపరి 2014లో TSRTC ఏర్పాటైంది. ఈ రెండు కార్పోరేషన్లలో వేలాదిమంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.
గ్రామాల నుంచి పట్టణాలు నగరాల వరకూ రోజూ లక్షలాదిమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూంటారు. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమంటే అదే ఆర్టీసీకే సాధ్యం అంటారు ప్రయాణికులు. పేదల పుష్పక విమానంగా పేరుగాంచిన ఎర్రబస్సు.. ప్రైవేట్ వాహనాలకు దీటుగా ఆధునిక హంగులనూ సమకూర్చుకుంటోంది. సరకు రవాణాలోనూ సత్తా చాటుతోంది. ప్రైవేట్ కొరియర్ సంస్థలకు పోటీగా సరుకు రవాణా చేస్తోంది. కోవిడ్ టైంలోనూ సేవలు అందించింది. అయితే, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడింది. టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్శిల్ విభాగంలో సమూల మార్పులు చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫోకస్ పెట్టారు. రైల్వేతో కలిసి సరుకు రవాణాలో ముందుకెళ్లాలని, తద్వారా వేగవంతమయిన సేవలు అందించాలని భావిస్తోంది ఆర్టీసీ. పార్శిల్స్ బుక్ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపార కేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో సిబ్బంది వెళ్లి సరుకును తీసుకువచ్చి..అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు. దీనివల్ల వినియోగదారులను మరింత చేరుకునే అవకాశం కలుగుతుంది.
Rtc90
విద్యార్ధులు పోటీ పరీక్షలకు, పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తోంది. ఆర్టీసీ బస్టాండ్లలో పసిపిల్లలు తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ప్రత్యేకంగా బాక్సులు అందుబాటులో వుంచారు. ప్రయాణికులకు సుఖమయ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సేవలు మరింత మందికి అందుబాటులోకి వచ్చాయి. కానీ ఛార్జీల భారం ఎక్కువగా వుందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ రేట్ల పెంపువల్ల ఛార్జీల భారం మోయక తప్పదంటున్నారు అధికారులు.
