NTV Telugu Site icon

Andhra Pradesh: ఈ ఆర్టీసీ డ్రైవర్ ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..!!

Rtc Driver

Rtc Driver

సాధారణంగా ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఐదు అడుగుల ఎత్తు వరకూ ఏమీ కనిపించదు. కొన్నిసార్లు ప్రయాణికులు, పాదచారులు బస్సు ముందు నుంచి వెళ్తుంటే.. ఎవరూ లేరని భావించి డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే ఇదే తరహాలో రెండు ప్రమాదాలు జరగడంతో ఆయా బస్సులను నడిపిన డ్రైవర్లు ఆరు నెలల పాటు సస్పెండయ్యారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వచ్చేది.

ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజు అనే ఆర్టీసీ డ్రైవర్ చేసిన ఆలోచన పలువురిని ఆకట్టుకుంటోంది. బస్సు ముందు భాగంలో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు సత్యనారాయణరాజు నడుం బిగించాడు. ఈ మేరకు బస్సు ముందు భాగంలో ఆయనకు స్టీల్‌ బాల్‌ పెట్టాలనే ఐడియా వచ్చింది. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్‌ బాల్‌ను 2 అడుగుల రాడ్‌కు అమర్చి దానిని డ్రైవర్‌ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించాడు. ఈ స్టీల్‌ బాల్‌లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్‌ డోర్‌ వరకూ కనిపిస్తుందని.. దీంతో బస్సు ముందు ఎవరూ లేరని గుర్తించడం సులభతరం అవుతుందని డ్రైవర్ సత్యనారాయణ రాజు వివరించాడు. తద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయపడుతున్నాడు. కాగా సత్యనారాయణరాజు ఆలోచనకు పలువురు సలాం కొడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. భక్తుల ఆగ్రహం