Rayalaseema JAC: మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ చేపట్టిన ఉద్యమం క్రమంగా ఉధృతం అవుతోంది. ఇటీవల విశాఖలో ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన నిర్వహించగా.. తాజాగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ జేఏసీ భారీగా మిలియన్ మార్చ్ చేపట్టింది. ఈ మేరకు రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టగా.. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు, మేధావులు పాల్గొన్నారు. రాయలసీమకు 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి న్యాయ రాజధానే సరైన పరిష్కారమని రాయలసీమ జేఏసీ అభిప్రాయపడింది. సీఎం జగన్ ప్రకటించిన రాజధానుల వికేంద్రీకరణకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలియజేశారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినాదాలు చేశారు.
Read Also: NTR University: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మారిపోయింది.. చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
కాగా వారం రోజుల క్రితం వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి న్యాయ రాజధానిపై తమ గళాన్ని వినిపించారు. అక్టోబర్ 30న రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు జరిగాయి. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోటా న్యాయ రాజధాని కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి.