NTV Telugu Site icon

Rains Alert: ఏపీలో మూడు రోజుల భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

Rains Alert

Rains Alert

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ లో బలపడిన అల్పపీడనం… పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఇక, ఇది క్రమంగా ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారుతుందని.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇక, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది..

Read Also: Srikakulam Crime: వైసీపీ నేత దారుణ హత్య.. కత్తితో నరికి..!

ఇక, వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ… దక్షిణకోస్తాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు స్పష్టం చేసింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన ప్రకటనలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. మరోవైపు.. మాండూస్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో తమిళనాడుకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.. చెన్నై, కడలూరు, కన్యాకుమారి సహా ఆరు జిల్లాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి… ఈ నెల 10వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు..

Show comments