Site icon NTV Telugu

Rain Alert: అలర్ట్.. రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు

Rain Alert

Rain Alert

Rain Alert: ఏపీ ప్రజలను మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేయనున్నాయి. ఐఎండీ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి శ్రీలంకకు తూర్పున 600 కి.మీ. దూరంలో, తమిళనాడులోకి కారైకల్‌కు 630 కి.మీ. దూరంలో, చెన్నై తీరానికి 670 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. నెమ్మదిగా వాయుగుండం కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Read Also: Andhra Pradesh: రైతులకు శుభవార్త.. ఈనెల 29న ఖాతాల్లో డబ్బులు జమ

వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని.. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాలలోనూ భారీవర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Read Also: Jeff Bezos: కార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రజలకు అమెజాన్ అధినేత సూచన

Exit mobile version