Punganur Violence: చిత్తూరు జిల్లా పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా చెలరేగిన హింసపై పుంగనూరు అర్బన్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ అల్లర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొంటూ, ఆయనతో పాటు మరో 50 మంది అనుచరులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
స్థానిక బీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద ఈ గొడవ జరిగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిని ఆంక్షల ప్రాంతంగా నిర్ణయించినప్పటికీ, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది ఏడు వాహనాల్లో దూసుకొచ్చి బారికేడ్లను, గేట్లను బద్దలు కొడుతూ లోపలికి చొరబడ్డారని పోలీసులు గుర్తించారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై కర్రలు, రాడ్లతో దాడి చేసి కార్లను ధ్వంసం చేయడంతో అక్కడ తీవ్ర రణరంగం నెలకొంది.
పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లరి మూకలను అదుపు చేసేందుకు మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ తన సర్వీస్ పిస్టల్తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ విధ్వంసంపై పుంగనూరు పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలతో ఎంపీ సహా మొత్తం 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు.

