YSRCP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. అయితే ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి తన బావమరిది శ్రీధర్‌రెడ్డితో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. అయితే బావ, బావమరిది మధ్యలో మామ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే మామ వెంకటరమణారెడ్డి తన అల్లుడికి మద్దతుగా నిలబడ్డారు. ఆస్తి కోసం కొడుకు శ్రీధర్ రెడ్డి తనపై హత్యాయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మారణాయుధాలతో చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు శ్రీధర్ రెడ్డిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: CM Jagan: రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శం
వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రెడ్డిపై పోలీసులు సెక్షన్ 109, 120b, 307, 309, 427, 448, 506 IPC 30 కింద కేసు నమోదు చేశారు. అయితే శ్రీధర్‌రెడ్డి పోలీసులను కూడా బెదిరించి దాడి చేసేలా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూతలపట్టు-నాయుడుపేట హైవే సమీపంలో ఉన్న రెండు ఎకరాల భూమిపై వివాదంపై కొన్ని రోజులుగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆయన బావమరిది శ్రీధర్‌రెడ్డి కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి. శనివారం రాత్రి సైతం తన భార్య, పిల్లలతో ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి శ్రీధర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.