NTV Telugu Site icon

Presidential Naval Fleet Review: యుద్ధనౌకల సమీక్షకు వేదికైన విశాఖ

సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి.

మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల క్రితం నేవీ అమ్ముల పొదిలో చేరింది ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నం. శత్రువులపై విరుచుకుపడే అతిపెద్ద డిస్ట్రాయర్ నౌకగా ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నంకు గుర్తింపు వుంది.

కల్వరి సిరీస్ లో నాలుగవ సబ్ మెరైన్ ఐ.ఎన్.ఎస్. వేల. యాంటీషిప్ మిసైళ్లతో విరుచుకుపడే శక్తి సామర్థ్యం వేల జలాంతర్గామి ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టానికి వేదికైంది విశాఖ. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. యుద్ధనౌకల సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్. ఐ.ఎన్. ఎస్.సుమిత్రలో ప్రయాణించనున్నారు రాష్ట్రపతి. ఆర్కేబీచ్ నుంచి తెన్నేటి పార్క్ వరకు కొనసాగనుంది పీఎఫ్ ఆర్. రాష్ట్రపతి 44 యుద్ధ నౌకలను సమీక్ష చేయనున్నారు. పీఎఫ్ఆర్ లో 60 యుద్ధ విమానాలు,హెలీకాప్టర్లు పాల్గొంటున్నాయి. యుద్ధ నౌకలు 55 వున్నాయి. ప్రెసిడెంట్ ప్రయాణించే ఐ.ఎన్. ఎస్. సుమిత్రను అనుసరించనున్నాయి రెండు యుద్ధ నౌకలు. పీ.ఎఫ్.ఆర్.లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ పాల్గొంటాయి.

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, అండమాన్‌ నికోబార్‌ లఫె్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ డి.కె.జోషి, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి డి.జె.చౌహాన్‌, రాష్ట్ర హోంమంత్రి ఎం.సుచరిత, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రిత్వశాఖల కార్యదర్శులు, తదితరులు పి.ఎఫ్‌.ఆర్‌. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ సమీక్ష సముద్రంలో జరగనుండడంతో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని సీపీ తెలిపారు.