NTV Telugu Site icon

సచివాలయంలో పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతోంది : వెంకట్రామిరెడ్డి

ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా చలో విజయవాడ కార్యక్రమానికి రాకుండా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు నిర్బంధించారు. అయితే ఉద్యోగులు మారువేషాల్లో పోలీసుల కళ్ళు గప్పి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా నేడు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఛలో విజయవాడ విజయవంతమైందని ఆయన అన్నారు. ఉద్యోగులు స్వచ్చందంగా తరలి వచ్చారని, విజయవాడ చరిత్రలో ఇటువంటి ఉద్యమం ఎప్పుడు చూడలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొందరు ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేశారని, ప్రభుత్వం సమస్య గుర్తిస్తుందని ఊహించామని, నిన్న అంత పెద్ద ఆందోళన చూసి కూడా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహారిస్తోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీల వాళ్ళు ఎవ్వరు నిన్న ఆందోళనలో పాల్గొనలేదని, పార్టీల కార్యకర్తలు ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతోందని, సీఎస్, శశిభూషణ్ వ్యాఖ్యలపై స్టీరింగ్ కమిటీలో చర్చిస్తామన్నారు. ఒత్తిడి తీసుకురాకుండా ఘర్షణ వాతావరణం రాకుండా పోలీసులు వ్యవహరించారని, పోలీసులు మాకు సహకారాన్ని అందించారు అనేది అబద్ధమన్నారు. పోలీసులు చాలా ప్రాంతాల్లో ఉద్యోగులను విజయవాడ రాకుండా అడ్డుకున్నారని, ఉద్యోగుల మేలు కోసం ఎవ్వరు మద్దత్తు ఇచ్చినా మంచిదేనని ఆయన అన్నారు.