Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్ర కలకలం రేపింది.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్న ఆయన, గాయపడిన వారికి అందుతున్న వైద్యసాయంపై సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యుత్తమ చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?
ఈ ప్రమాదంపై విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవదహనం కావడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. ఇక, వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కూడా ఘటనపై స్పందిస్తూ, అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించాలని ఆదేశించారు. అదేవిధంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
