Site icon NTV Telugu

Andhra Pradesh: ప్రజలకు గమనిక.. విద్యుత్ వినియోగంపై ఆంక్షలు

Power Using

Power Using

దేశంలో 12 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పాటు ఇళ్లకు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. వేసవి కారణంగా ఏపీలో డిమాండ్ పెరిగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ కొరత నెలకొంది. దీంతో విద్యుత్ వినియోగంపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే పరిశ్రమలపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించగా.. తాజాగా గృహ వినియోగదారులపైనా అవి అమలు కానున్నాయి.

విద్యుత్ వినియోగంపై పంపిణీ సంస్థలు విధించిన ఆంక్షలు ఇలా ఉన్నాయి. ఏసీల వాడకం తగ్గించాలని, నీటి మోటార్లను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే వాడాలని పంపిణీ సంస్థలు సూచించాయి. ఐఎస్‌ఐ మార్కు ఉన్న మోటార్లు, పంపులు వినియోగించాలని తెలిపాయి. అవసరమైతేనే లైట్లు ఉపయోగించాలని.. బయటకు వెళ్తే లైట్లను ఆఫ్ చేయాలని పేర్కొన్నాయి. వస్త్ర దుకాణాలు, సూపర్ మార్కెట్లలో 50 శాతం లైట్లను మాత్రమే ఉపయోగించాలని విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి.

మరోవైపు ఏపీలో జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్లకు డిస్కంల ద్వారా ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 12,49,133 ఇళ్లకు విద్యుత్‌ ఇవ్వాలని తెలిపింది. దీనికి అవసరమైన నిధులను గృహ నిర్మాణ శాఖకు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే రూ.4600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ అంగీకారం తెలిపాయి. అటు జగనన్న కాలనీలకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం రూ.1217.17 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,813 లే అవుట్లు ఉంటే.. 5,16,188 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లను రూ.2,519 కోట్లతో అందిస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని మూడు జిల్లాలతో పాటు సీఆర్‌డీఏ పరిధిలో ఉండే 6 లక్షల ఇళ్లకు రూ.1,805 కోట్లతో విద్యుత్ ఇవ్వనున్నారు.

ATA Convention: సీఎం జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు

Exit mobile version