Site icon NTV Telugu

ఏపీలో రోడ్డెక్కిన రాజకీయం ?

ఏపీలో రాజకీయం రోడ్డెక్కింది. గుంతలు పూడుస్తామని జనసేన.. వర్షాలు తగ్గాక రోడ్లు వేస్తామని అధికార వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే రోడ్లు వేసే టైమ్‌లో జనసేన ఈ ఉద్యమం ఎత్తుకుందా? లేక.. జనసేన గళమెత్తాక రహదారులు వేస్తున్నారా? ఇంతకీ ఎవరి దారి రహదారి?

అప్పట్లో సోషల్‌ మీడియాలో రోడ్లపై జనసేన ఉద్యమం..!

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఉప్పు నిప్పుగా రాజకీయ సెగలు రేగుతున్న సమయంలో జనసేన రోడ్ల మరమ్మత్తు ఉద్యమం ఆసక్తికర చర్చగా మారింది. కొన్నాళ్లుగా సోషల్‌ మీడియా వేదికగా రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై పోరాటం చేస్తోంది జనసేన. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తున్నామని.. అప్పటికి సర్కార్‌ పూనుకోకపోతే.. తామే రోడ్లకు మరమ్మత్తులు చేస్తామని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.

పవన్‌ వస్తున్నారని తెలిసి రిపేర్లు చేశారని జనసేన ప్రచారం..!

అన్నట్టుగానే అక్టోబర్‌ 2న ముహూర్తం ఫిక్స్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌ ఫీల్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడైతే శ్రమదానం చేయాలని అనుకున్నారో అక్కడ హడావిడిగా రిపేర్లు చేపట్టారు. దీంతో చర్చ మరోలా మళ్లింది. పవన్‌ వస్తున్నారని తెలిసే రిపేర్లు చేశారని జనసైనికులు సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రజల్లో ఇంకో చర్చ జరుగుతోంది.

రోడ్ల కోసం రూ.2 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం..!
రోడ్లు వేస్తారని తెలిసే జనసేన రోడ్డెక్కిందా?

వాస్తవానికి రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో.. వర్షాలు తగ్గాక పనులు చేపట్టాలని 2 వేల కోట్లు కేటాయించింది సర్కార్‌. దీనిపై సమీక్షలు జరిగాయి. మంత్రులు ప్రకటనలు వచ్చాయి. ఇలాంటి సమయంలో జనసేన చేపట్టిన రోడ్ల రిపేర్ల శ్రమదానంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు జనం. ఎలాగూ రహదారులు వేస్తున్నారు కదా అని జనసేన రోడ్డెక్కిందా? లేక జనసేన ఉద్యమిస్తుందని రోడ్లు వేస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన రిపేర్లను తమ ఖాతాలో వేసుకుంది జనసేన. రేపటి రోజున సర్కార్‌ వేసే రహదారులను కూడా తమ క్రెడిట్‌గా జనసేన చెప్పుకొంటుందా అనే ప్రశ్నలు ఉన్నాయి. వర్షాలు తగ్గగానే రోడ్లు వేస్తామని ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ టైమ్‌లో గోతులు పూడ్చేవాళ్లను పిచ్చోళ్లంటారని కౌంటర్‌ ఇచ్చారు కూడా.

ఈ టైమ్‌లో టీడీపీ ఎందుకు సైలెంట్‌?

జనసేన కంటే ముందుగానే ఏపీలో టీడీపీ రోడ్లపై పోరాటం చేసింది. కానీ ఈ అంశాన్ని జనసేన చేపట్టిన తర్వాతే వాడీవేడీ చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడే అవకాశం చిక్కినా.. టీడీపీ సైలెంట్‌. వాస్తవానికి టీడీపీ హయాంలోనే రోడ్డు దెబ్బతిన్నాయన్నది వైసీపీ వాదన. మరి.. ఈ రహదారుల రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version