కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించిన ఆత్మకూరు వర్ధన్ సొసైటీ మోసాలపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. సబ్సిడీ రుణాల పేరుతో సుమారు 3 కోట్ల 63 లక్షల రూపాయలను సేకరించారని ఎస్పీ వెల్లడించారు. ఎమ్మిగనూరుకి చెందిన మహేష్ కుమార్ అలియాస్ జాషువా తన సంస్థ ద్వారా సేకరించినట్లు తేలిందన్నారు. 2 కోట్ల 70 లక్షలు దుర్వినియోగానికి సాక్ష్యాలు లభించాయని, డబ్బు అధికశాతం సొసైటీ ప్రధాన నిర్వాహకుడు మహేష్ కుమార్ అలియాస్ జాషువా తీసుకున్నారని తెలిపారు.
20 లక్షలు సొసైటీ నిర్వహకుడు బాలన్న తీసుకున్నట్లు తేలిందన్నారు పోలీసులు. బాలన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. వర్ధన్ సొసైటీ స్థిరాస్తులపై ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ 2018 చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కంపెనీ ఆస్తుల రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు. జాషువాను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్ధిస్తామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
డిపాజిట్ల రూపంలో కోట్లాదిరూపాయలు మహేష్ కుమార్ సేకరించారని అందులో రెండు కోట్ల యాభై లక్షల వరకు రికార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ బ్యాంకు కు సంబంధించి 300 మంది బాధితులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.