టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఈ నెల 18న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రి ఎంపీ భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీరియస్ అయ్యారు. సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి, విద్వేషాలు రగిలించారని నల్లజర్ల వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కండెపు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అయ్యన్నపాత్రుడిపై సెక్షన్ 506, 505, 153 (a)కింద కేసు నమోదు చేశారు.
కాగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టుకున్నా వెనక్కు తగ్గేది లేదన్నారు. ఏపీ పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించారన్న కారణంగా వైసీపీ నేతలు అయ్యన్నపాత్రుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
