పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీం కోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు , లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ, రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందుంచాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను , సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఆ ఉప్పునీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (GWDT) అవార్డు నిబంధనల ప్రకారం, మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్ధమైన హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్‌లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో, ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రాజెక్టు పురోగతిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ రిపోర్ట్‌ను సమర్పించామని, వారి సూచనల మేరకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన డీపీఆర్ టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్యలు మాత్రమేనని, చట్టపరమైన అన్ని అనుమతులు , క్లియరెన్సులు లభించిన తర్వాతే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో రాష్ట్రం తన వాదనను సమర్థవంతంగా వినిపించి, ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేలా లీగల్ టీం అలెర్ట్‌గా ఉండాలని ఆయన ఆదేశించారు.
Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ చూశారా!
