NTV Telugu Site icon

Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ

Araku Coffee

Araku Coffee

Araku Coffee: అరకు కాఫీపై ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అరకు కాఫీ బాగుంటుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. గిరిజనుల సాధికారత అరకు కాఫీతో ముడిపడి ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నాటి ఫొటోలను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అరకు కాఫీకి ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్‌లోనూ ప్రశంసలు దక్కాయని ప్రధాని చెప్పారు. అదేవిధంగా మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కాఫీ ప్రియులైతే, ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి వచ్చే కాఫీని రుచి చూడాలని మోడీ ట్వీట్ చేశారు.

Read Also: Team India Prize Money: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. రూ.125 కోట్ల నగదు బహుమతి

ప్రధాని మోడీ ట్వీట్‌కు స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోడీతో కలిసి మరోసారి అరకు కాఫీ తాగే సమయం కోసం ఎదురు చూస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోడీ మేడిన్ ఏపీ ఉత్పత్తిని ఆమోదించినందుకు ధన్యవాదాలంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో పండించడంతో ఇక్కడి కాఫీ పంటకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.