Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు అని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది అని పేర్కొన్నారు. అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Read Also: Thummala: బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా?
అయితే, ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తైందని అధికారులు తెలిపారు. తొలి రోజునే 96 శాతం పెన్షన్లను పంపిణీ చేసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది.. సాయంత్రం 4 గంటల సమయానికి 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నాలుగు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేలా సచివాలయ ఉద్యోగుల ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ చేశారు.