MLC Venkateswara Rao: శాసన మండలిలో చర్చ కంటే రచ్చ ఎక్కువగా నడిచిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నారని.. పోలవరంపై వాస్తవాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పీడీఎఫ్ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అసలు పోలవరం ప్రాజెక్టు వ్యయం ఎంత.. నిర్వాసితులకు ఇచ్చే పరిహారం ఎంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 75శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. కానీ మిగతా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. నిర్వాసితులకు పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తేల్చాలన్నారు. సభలో వినపడి వినపడనట్లు బూతులు వినిపిస్తున్నాయని.. సభ్యుల చేతులు, కాళ్లూ లేస్తున్నాయని.. మంత్రులు కూడా అలానే మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు విమర్శించారు. అసలు సభకు ఎందుకు వచ్చామా అనే భావన తమకు కలుగుతోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు.
Read Also:Headless Body Case: మొండెం లేని మృతదేహం.. ఏడాది తర్వాత కేసుని చేధించిన పోలీసులు
అటు టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పశువులను కూడా అరెస్ట్ చేస్తుందని.. అమరావతి రైతులు ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తుంటే ఎద్దులను కూడా పోలీస్ స్టేషన్‌లో పెట్టారని ఆరోపించారు. రైతుల కోసం టీడీపీ పోరాటం చేస్తుందని.. వ్యవసాయం మీద చర్చ చేసే దమ్ము లేక ప్రభుత్వం పారిపోయిందన్నారు. సభలో రైతు సమస్యలపై చర్చ జరగాలని.. రేపు కూడా ఇదే అంశంపై తాము పోరాడతామన్నారు. జోగి రమేష్ పెద్ద మగాడిలా మాట్లాడుతున్నాడని.. చట్ట సభల్లో మాట్లాడటం రాని వాళ్ళను మంత్రులు చేస్తే సభలో బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లి అడ్డ దారిలో మంత్రి పదవి తెచ్చుకున్న జోగి రమేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు హితవు పలికారు. ఎమ్మెల్సీ ఫరూక్పై అసభ్య పదజాలంతో మాట్లాడిన మంత్రి జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవాలని.. లేదంటే రేపు సభ జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమ నేతలపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
