NTV Telugu Site icon

Pawan Kalyan: ఈనెల 13న విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 13న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కని పరిస్థితి నెలకొందని.. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం చేపట్టిందని తెలిపింది. #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా కాలనీలు, గృహనిర్మాణ స్థితిగతులను సామాజిక మాధ్యమాల్లో చూపించబోతున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని జనసేన చేపట్టింది.

Read Also: Karthi: ‘సర్దార్’ గారు అప్పుడే ఓటిటీలోకి వచ్చేశారా..?

ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటించి పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలించనున్నారు. 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించిందని.. ఈ మేరకు వైసీపీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి, పైలాన్ ఆవిష్కరించారని.. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారని జనసేన పార్టీ గుర్తుచేసింది. దీంతో సీఎం శంకుస్థాపన చేసిన గుంకలాం గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి ఇళ్లను పరిశీలిస్తారని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయో, పథకం అమలు తీరుని లబ్ధిదారులతో మాట్లాడి పవన్ తెలుసుకుంటారని పేర్కొంది.