Pawan Kalyan: కొన్నిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై చర్చ నడుస్తోంది. ఆర్మీ కలర్‌లో వారాహి రంగు ఉండటం వివాదానికి కారణమైంది. వారాహి రంగుపై ఏపీలో అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. అది వారాహి కాదని నారాహి అని.. ఆలివ్ గ్రీన్ రంగు కాకుండా పసుపు కలర్ వేసుకోవాలని చురకలు అంటించారు. అయితే ఏదేమైనా ప్రస్తుతం వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం, వాహనం ఉండాల్సిన ఎత్తు కంటే ఎక్కువ ఉండటం, మైన్స్‌లో వాడాల్సిన వాహనాల టైర్లను రోడ్డుపై వెళ్లే వాహనానికి వాడటం, ఆర్మీకి సంబంధించిన కలర్‌ను సివిల్ వాహనానికి వాడటం వంటివి నిబంధనలకు విరుద్ధమంటూ తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ శాఖ సూచించినట్లు తెలుస్తోంది.
Read Also: Bangalore: అర్ధరాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3వేలు జరిమానా
తాము చెప్పిన అంశాల ప్రకారం వాహనాన్ని మార్చుకుంటే రిజిస్ట్రేషన్ చేయగలమని అధికారులు జనసేన పార్టీకి సూచించినట్లు సమాచారం. అందువల్ల ప్రస్తుతానికి వారాహి రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పెట్టినట్లు టాక్ నడుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ చేపట్టనున్న బస్సు యాత్ర కోసం అత్యాధునిక టెక్నాలజీతో, మెరుగైన హంగులతో వారాహి వాహనాన్ని జనసేన పార్టీ తీర్చిదిద్దింది. హైదరాబాద్‌లో ఈ వాహనాన్ని ప్రత్యేకంగా చేయించింది. అయితే మోటార్ వెహికల్ చట్టం 1989 ఛాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం తప్ప ఇతర వ్యక్తులు తమ వాహనాలకు ఆలీవ్ గ్రీన్ రంగు వాడకూడదు. అయితే వారాహికి ఈ రంగు వాడటం విమర్శలకు కారణమైంది. దీంతో వైసీపీకి చెందిన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అంశంలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.
