తెలుగు అకాడెమీ పేరును మారుస్తూ ఏపీ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడెమీని కాస్తా.. తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తున్నట్లుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు. పేరు మార్చడం ద్వారా ఏం సాధించారని నిలదీశారు.
తెలుగు భాష అభివృద్ధి కోసం, విద్యా విషయకంగా తెలుగు భాష వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడెమీ అస్తిత్వాన్నే దూరం చేసేలా పేరు మార్చారని పవన్ విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలుగు అకాడెమీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడెమీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అకాడెమీ పేరు మార్పు నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పవన్ కోరారు.
