ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా లోని కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయని, కడప రిమ్స్ ఘటనలో ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పసిబిడ్డల తల్లితండ్రులను పోలీసులతో ఎందుకు తరలించారు? కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం.
విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే పసి బిడ్డలు కన్నుమూశారు. ఒక మానిటర్ తోనే 30మంది పిల్లలకు వైద్య సేవలు చేశారని చెబుతున్న తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలి. ఇటువంటి తీవ్ర ఘటన జరిగినప్పుడు తక్షణం తనిఖీలు చేసి విచారణ చేయాల్సిన జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? అని పవన్ ప్రశ్నించారు.
ఆసుపత్రి అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఈ ఘటనపై వివరాలు కోరిన మీడియాను ఎందుకు ఆసుపత్రిలోకి రానీయడం లేదు? అని ఆయన అన్నారు. బిడ్డల మరణంతో ఆందోళనలో ఉన్న తల్లితండ్రులను పోలీసులను పిలిపించి మరీ ఎందుకు తరలించారు? ఆరోగ్య సమస్యలతో ఉన్న మరో 30 మంది పిల్లల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఇవ్వాల్సిన అవసరం లేదా?అన్నారు పవన్. ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదన్నారు.
ఉన్న వైద్య ఉపకరణాలను వినియోగించరు. ప్రభుత్వంలోని పెద్దలకు మానవీయ కోణం లోపించడమే వైద్య రంగంలో ఇలాంటి దుర్ఘటనలకు కారణం అవుతోంది. పాలకపక్షం తప్పులు, దూరదృష్టి లేమి కారణంగా అభంశుభం ఎరుగని పసికందులకు నూరేళ్లు నిండాయి. ఈ పరిస్థితి అత్యంత అమానుషం, శోచనీయం. కనీసం ఆస్పత్రులకు 24 గంటలు విద్యుత్ అందించలేని దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకోవడం అత్యంత దురదృష్టకరం. మండిపోతున్న ఎండల కారణంగా విద్యుత్ వాడకం పెరగడంతో కోతలు విధిస్తున్నామని పాలకులు చెప్పడం వారి చేతకానితనానికి నిదర్శనం.
ఎండలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మండిపోతున్నాయా? పక్కనున్న తెలంగాణ, తమిళనాడు లలో లేవా? అని ఎద్దేవా చేశారు పవన్. మరి అక్కడ విద్యుత్ కోతలు ఎందుకు లేవు? ఇకనైనా ప్రభుత్వంలోని పెద్దలు కళ్ళు తెరిచి ఆస్పత్రులలో జనరేటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. మరొక్క ప్రాణం కూడా పోకుండా తక్షణం చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.