NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పొలిటికల్ క్యారక్టర్ ఆర్టిస్ట్: అడపా శేషు

Pk Adapa

Pk Adapa

పవన్‌ కళ్యాణ్‌ ఫుల్‌ టైమ్‌ పొలిటీషియన్‌ కాదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివే పార్ట్‌ టైమ్‌ పొలిటికల్‌ క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ అని ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరిరావు ఎద్దేవా చేశారు. కాపులకు ఏం కావాలో అవన్నీ సీఎం జగన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్‌ పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. కాపునని చెప్పుకోలేని ఆయన కూడా కాపుల గురించి మాట్లాడుతున్నాడని దెప్పిపొడిచారు. జనసేన పార్టీ పవన్‌ కళ్యాణ్‌దే అయినా నడిపించేది మాత్రం నాదెండ్ల మనోహర్ అని తెలిపారు. పక్కనే ఉన్న వంగవీటి మోహన్‌ రంగా విగ్రహానికి పూలమాల వెయ్యని పవన్‌కి ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.

చంద్రబాబు హయాంలో కాపులు అనేక ఇబ్బందులు పడుతుంటే అప్పుడు ఈయన ఏమయ్యాడని అడపా శేషు నిలదీశారు. “పవన్ నిత్యం కుల, మత రాజకీయాలు చేస్తున్నాడు. జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ప్రభుత్వ పథకాలపై టీడీపీ, జనసేన అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. వెనకబడిన అగ్ర కులాల విద్యార్థుల కోసం జగన్‌ విదేశీ విద్యా దీవెన పథకంతో వరమిచ్చారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఎక్కువ మందికి ఈ స్కీమ్‌ వర్తించేలా చర్యలు తీసుకున్నారు.

గత ప్రభుత్వం రూ.6 లక్షల వార్షిక ఆదాయ నిబంధన పెడితే దాన్ని సీఎం జగన్ రూ.8 లక్షలకు పెంచారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారు. చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. కార్పొరేషన్ పేరుతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. డబ్బున్న పిల్లలు కూడా కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్లారు. కొంత మంది విద్యార్థులు విదేశాలు వెళ్లకుండానే డబ్బు కాజేశారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ కాపు కార్పొరేషన్‌ను సక్రమంగా నడిపిస్తున్నారు” అని అడపా శేషు వివరించారు.

టీడీపీ నేత బుద్ధా వెంకన్న పైన కూడా అడపా శేషు ఫైర్‌ అయ్యారు. ఆయన బతుకేంటో విజయవాడలో అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డిని ఏక్‌నాథ్‌ షిండే అంటూ బుద్ధా వెంకన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే నాలుక కొస్తామని ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు హెచ్చరించారు.