Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!

  • తుఫాన్ హెచ్చరికలతో బోటు షికార్లు నిలిపివేత
  • సుమారు 16 పర్యాటక బోట్ల రాకపోకలకు బ్రేక్
  • రెండు వారాలకే మళ్లీ నిలిచిన విహారయాత్రలు
  • వాతావరణం అనుకూలించాకే బోటు ప్రయాణాలకు అనుమతి
Papikondalu

Papikondalu

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ముప్పు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రభావం పర్యాటక రంగంపై కూడా పడింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. తుఫాన్ ముప్పు పొంచివున్న కారణంగా గోదావరి నదిలో బోటు షికార్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి టూరిజం బోట్ల రాకపోకలను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.

భద్రతా చర్యల్లో భాగంగా 16 బోట్లు నిలిపివేత

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పర్యాకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి నడిచే సుమారు 16 టూరిజం బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా దాదాపు 70 రోజుల పాటు పాపికొండల బోటు షికార్లు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. మళ్లీ ఆటంకం

గోదావరి వరదలు తగ్గుముఖం పట్టడంతో పాటు దసరా సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేవలం రెండు వారాల క్రితమే పాపికొండల విహారయాత్రలను అధికారులు పునఃప్రారంభించారు. పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే దేవీపట్నం మండలం గండి పోచమ్మ పాయింట్ నుంచి మూడు టూరిజం బోట్లలో సుమారు 199 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అయితే, ఇంతలోనే తుఫాన్ ముప్పు మునుముందుకు రావడంతో పర్యాటకుల భద్రత రీత్యా యాత్రను మళ్లీ తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోయి, వాతావరణం అనుకూలించిన తర్వాతే బోటు షికార్లను పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. పర్యాటకులు ఎవరూ గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.