NTV Telugu Site icon

TDP vs TDP: జేసీకి పల్లె రఘునాథరెడ్డి కౌంటర్‌.. నా పర్మిషన్‌ ఉంటేనే..!

Palle Raghunatha Reddy

Palle Raghunatha Reddy

ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ, టీడీపీ మధ్యే కాదు… టీడీపీ వర్సెస్‌ టీడీపీగా కూడా రాజకీయాలు నడుస్తున్నాయి.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పుట్టపర్తికి రాకుండా అడ్డుకున్నారు పోలీసులు.. మరో వైపు పుట్టపర్తికి జేసీ ప్రభాకర్ రెడ్డి రాకను నిరసిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నేతృత్వంలో స్వంత పార్టీ వారే నిరసనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు భారీగా పుట్టపర్తిలో మోహరించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే జేసీని అడ్డుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక, జేసీ ప్రభాకర్‌రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు పల్లె రఘునాథరెడ్డి..

Read Also: Viral: వెడ్డింగ్ రిసెప్షన్‌లో నవ దంపతుల స్టంట్.. వణికిపోయిన అతిథులు..!

ఉజ్వల ఫౌండేషన్‌లో జరిగిన భూకబ్జాలు అక్రమాలపై ఇదివరకే జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపిన ఆయన.. నా ఫిర్యాదు మేరకే జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సబ్ కమిటీ వేశారని తెలిపారు.. బాధితులకు న్యాయం జరిగి తీరుతుందని నాకు విశ్వాసం ఉందన్న ఆయన.. అలా జరగని పక్షంలో బాధితులకు అండగా ఉద్యమం చేస్తానని ప్రకటించారు. కానీ, ఇది తెలియకుండా నా నియోజకవర్గంలో సమస్యలపై జేసీ తల దూర్చడం ఏంటి..? అంటూ ఫైర్‌ అయ్యారు. నా నియోజకవర్గంలో నా పర్మిషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఇక, నాకు జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు పల్లె రఘునాథరెడ్డి… రెడ్డి సామాజిక వర్గం, మంత్రి పదవికి అడ్డు వస్తానని.. నా నియోజకవర్గంలో తలదూరుస్తున్నాడేమో..? అని అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలోకి వచ్చి ప్రభాకర్ రెడ్డి చిచ్చు రేపుతున్నన్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మొత్తంగా.. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తి పర్యటన.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఉన్న కుమ్ములాటలను బహిర్గతం చేసినట్టు అయ్యింది.