Site icon NTV Telugu

ONG Water Problem: గుక్కెడు నీటి కోసం జనం కష్టాలు

Ong Water

Ong Water

పేరుకే అది ఒంగోలు నగర పాలక సంస్థ. నగరంలో మూడు-నాలుగు రోజులకు ఒక సారే నీళ్లిస్తారు. అది కూడా అర్థరాత్రి దాటాకే. ఇక శివారు ప్రాంతాలకు అరకొర ట్యాంకర్లే గతి. దీంతో గుక్కెడు మంచినీళ్ల కోసం అవస్థలు పడాల్సివస్తోంది. మూడు లక్షలకు పైగా జనాభా ఉన్న ఒంగోలు నగరంలో ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు అంటున్నారు ప్రజలు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మంచినీటి కోసం జనం జాగారాలు చేయాల్సి వస్తోంది.

ఒంగోలు నగరంలో 3 లక్షలకు పైగా జనాభా ఉండగా, 90 వేల ఇళ్లకు నీటి కనెక్షన్లున్నాయి. ఒంగోలు నగర నీటి అవసరాలను తీర్చేందుకు రెండు చెరువులు ఉన్నాయి. నాగార్జున సాగర్‌ నుంచి నీటిని తీసుకువచ్చి ఈ చెరువులను నింపుతారు. తర్వాత ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు తరలించి… వాటి ద్వారా నగర వాసులకు నీరు విడుదలవుతుంది. అయితే, పైప్‌లైన్లు, మోటార్ల సమస్యతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మూడు-నాలుగు రోజులకు ఒకసారి నీటిని ఇస్తున్నారు అధికారులు.

ప్రస్తుతం ఒంగోలు నగరంలో 14 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులున్నాయి. ప్రస్తుత జనాభాకు అవి బొత్తిగా చాలడం లేదు. మరో 10 ట్యాంకులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ దిశగా అధికారులు, పాలకవర్గం ప్రయత్నించడం లేదు. నగరంలోని పీర్లమాన్యంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణం పూర్తయింది. కానీ… దానిని నిరుపయోగంగా వదిలేశారు. ముక్తి నూతలపాడులో 7 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మించారు. దానికి గుండ్లకమ్మ నుంచి పైపు లైను ఏర్పాటు చేయలేదు. దీంతో అది కూడా దిష్టిబొమ్మలా వెక్కిరిస్తోంది. సాగర్‌ ద్వారా చెరువులకు నీరు తెస్తే.. తమ నీటి కష్టాలు తీరుతాయంటున్నారు నగర వాసులు.

ఒంగోలు నగర నీటి సమస్య పరిష్కారం కోసం గతంలో అదనపు తాగునీటి పథకం ప్రారంభించారు. అలాగే, 120 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమృత్ పథకం చేపట్టారు. కానీ… ఆ పనులు అర్థంతరంగా ఆగిపోయాయి. సాధారణంగా ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల లోపు మాత్రమే నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ… కార్పొరేషన్‌ అధికారులు రకరకాల సాకులు చెబుతూ అర్థరాత్రి దాటిన తర్వాత నీళ్లు వదులుతున్నారు. దీంతో నగర ప్రజలు నీళ్ల కోసం జాగారం చేయాల్సి వస్తోంది. శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు చేస్తున్నా… అక్కడ కూడా అరకొరగానే నీళ్లందుతున్నాయి.

మంచినీటి కోసం ఇంతగా ఇబ్బందిపడుతున్నారు జనం. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు చేపట్టి తమను నీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు ఒంగోలు వాసులు.

Sheldon Jackson: అలాంటి చట్టం ఉందా..? సెలక్టర్లు డ్రామాలాడుతున్నారు!

Exit mobile version