పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు రాష్ట్రపతి. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత వ్యాక్సిన్లు కోట్లాదిమంది ప్రాణాలు కాపాడాయన్నారు. ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల మందికి వ్యాక్సినేషన్లు అందించామన్నారు రాష్ట్రపతి.
కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేవన్నారు. కనీసం ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువుతీరింది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ డ్రిల్‌మెక్ SPA, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంవోయు కుదిరింది. దీని ద్వారా 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడి రానుంది. 2500 మందికి ఉపాధి లభించనుంది.
ఏడుగురు లాయర్లకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. జడ్జిలుగా పదోన్నతి పొందిన వారిలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత వున్నారు.
కర్నూలు జిల్లా శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్ చేసింది. అర్ధరాత్రి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. గతంలో కూడా పవర్ హౌస్ వద్ద రెండు సార్లు రెండు చిరుతపులులు సంచరించాయి.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రపంచానికి భరోసా ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టీకా పంపిణీ కార్యక్రమం, భారత్‌లో తయారైన వ్యాక్సిన్ల గురించి ప్రపంచానికి చాటి చెబుతాయని ఉద్ఘాటించారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.
భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం మరో 2,09,918 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఒక్కరోజులోనే 959 మంది మరణించారు. 2,62,628 మంది కొవిడ్‌ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ 47 రోజుల్లో 57 మంది సాక్షులను విచారించింది. కమిషన్ విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టు మార్టం వివేదికలు, ఫోటో గ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్‌తో పాటు వివిధ డాక్యుమెంటరీలను ఈ కమిషన్ సేకరించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రామ్ నారాయణ్ సింగ్ ఇంటి బేస్మెంట్లో కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. నోయిడా సెక్టార్ 50లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడినుంచే ఆయన ఓ సంస్థను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రాన్ని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఎడతెరిపి లేని వానల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.