Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్‌ హోమ్‌ సీజ్‌..!

Nursing Home Seized

Nursing Home Seized

Nursing Home Seized: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఎంబీఎస్ సర్జికల్ అండ్ మెటర్నిటీ నర్సింగ్‌ హోమ్‌ను అధికారులు సీజ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు రోగులు మృతి చెందడంతో ఈ చర్యలు చేపట్టారు. ఆర్డీఓ కుమార్‌ ఆసుపత్రిని తనిఖీ చేసి, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్తగా పేషెంట్లను చేర్చుకోవద్దని, ఎలాంటి వైద్య చికిత్సలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల మైలవరం మండలం మొరుసుపల్లికి చెందిన బండారు కుమారి, తిరువూరుకు చెందిన డెంటల్‌ డాక్టర్‌ తాళ్ల దీప్తి ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీప్తి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా తీవ్ర రక్తస్రావం కారణంగా మృతి చెందినట్లు సమాచారం. అంతకుముందు కూడా ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వారం రోజుల్లోనే ఇద్దరు మృతి చెందడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఆసుపత్రిలోని సిబ్బంది, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఘటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్‌ రమేష్‌పై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలోనూ ఆయన వద్ద చికిత్స పొందిన కొందరు మృతి చెందిన ఘటనలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆపరేషన్లకు సంబంధించిన రికార్డులు, గతంలో చోటుచేసుకున్న ఘటనలు, వైద్యుడి విధులపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

డాక్టర్‌ రమేష్‌ తెలంగాణలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వహిస్తూ తిరువూరులో ప్రైవేట్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారా? అనే అంశంపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డాక్టర్‌ రమేష్‌ నిర్వహించిన గత ఆపరేషన్లు, ఆసుపత్రి రికార్డులు, సిబ్బంది వివరాలు, గతంలో నమోదైన ఫిర్యాదులు తదితర అంశాలపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్‌ చేసి, కొత్తగా ఎలాంటి రోగులను చేర్చుకోవద్దని ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.