AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు రకరకాల హామీలు ఇస్తుంటారు. కానీ తన తల్లిని గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి ఏకంగా రూ.కోటి విరాళంగా ఇస్తానంటూ ఓ వ్యక్తి చేసిన ప్రకటన ఇప్పుడు స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. తన తల్లిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీకి రూ.కోటి అందజేస్తానని నర్రా గోపి ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల పరిధిలోని ఎస్. అమరవరం గ్రామంలో ఈ ప్రకటన వెలువడింది. గ్రామానికి చెందిన నర్రా గోపి తన తల్లి నర్రా దుర్గను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలంతా కలిసి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం రూ.కోటి విరాళంగా అందిస్తానని వెల్లడించారు.
కృష్ణానది తీరానికి సమీపంలో ఉన్న ఎస్. అమరవరం గ్రామంలో సుమారు 1,200 నుంచి 1,300 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో మొత్తం 829 మంది ఓటర్లు ఉన్నారు. కంచికచర్ల మండలానికి చివరి గ్రామంగా ఎస్. అమరవరం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధికి భారీ మొత్తాన్ని అందిస్తానంటూ నర్రా గోపి చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తన తల్లిని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే రూ.కోటి మొత్తాన్ని నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేస్తానని నర్రా గోపి స్పష్టం చేశారు. ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులకే వినియోగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, తల్లిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి రూ.కోటి ఇస్తానంటూ నర్రా గోపి చేసిన ప్రకటన ఎస్. అమరవరం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

