Nuzvidu: జిల్లాల విభజన సమయంలో మూడు జిల్లాలుగా రూపాంతరం చెందింది ఉమ్మడి కృష్ణా జల్లా.. వాటిల్లో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. విజయవాడ పార్లమెంటును ఎన్టీఆర్ జిల్లాగా, మచిలీపట్నం పార్లమెంటును కృష్ణా జిల్లాగా మార్చారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడలోని మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం ఉన్నాయి. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. ఉమ్మడి కృష్ణ జిల్లాగా ఉన్న సమయంలో విజయవాడను ఆనుకొని ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గం రెవెన్యూ పనులకు సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేవారు. ఏ పని కావాలన్నా, అటు విద్యాపరంగా.. వాణిజ్యపరంగా విజయవాడే వాళ్లకి ప్రధాన కేంద్రంగా ఉండేది.
Read Also: New Liquor Shops: తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
అయితే గన్నవరం, పెనమలూరు రెండు నియోజకవర్గాలు మచిలీపట్నం పార్లమెంటుగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో కలిశాయి. దీంతో రెవెన్యూ, కలెక్టర్, ఇతర ప్రభుత్వ పనులకు పక్కనే ఉన్న విజయవాడకు కాకుండా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గన్నవరం పెనమలూరు నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను తిరిగి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు ఏలూరు జిల్లాలో కలిపిన నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నామంటున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నూజివీడుని ఏలూరులో ఉంచడం వల్ల నష్టమేంటి? ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే లాభమేంటనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లామని చెబుతున్నారు. లేకపోతే మరింత వెనుకబడి పోతామని న్యాయవాదులు అంటున్నారు. ఈ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలను కొత్తగా అమరావతి జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల సమస్యపై పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏం నిర్ణయిస్తుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
