Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..

Budameru Floods

Budameru Floods

Budameru Floods: తీవ్ర వాయుగుండం తీరం దాటింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.. అయితే, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరులో వరద ఉధృతి పెరిగింది.. బుడమేరులో భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో బుడమేరు వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొండపల్లి కవులూరు బ్రిడ్జి వద్ద బుడమేరు నిండుకుండలా ప్రవహిస్తోంది.

పైనుంచి వస్తున్న వరద నీటితో బుడమేరులో ప్రవాహం పెరిగినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని ఇరిగేషన్ ఏఈ వెంకటేష్ తెలిపారు. వరద పరిస్థితిని అధికారులు గంట గంటకూ పర్యవేక్షిస్తున్నారు. పైనుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు పట్టిసీమ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కవులూరు బ్రిడ్జి వద్ద గతంలో గండ్లు పడిన ప్రాంతంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రస్తుతం ధృఢంగా నిలిచింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

పైనుంచి వస్తున్న వరద నీటి కారణంగా బుడమేరుకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరద ప్రవాహం కృష్ణా నదిలోని పాయల మధ్యగా కొనసాగుతోంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా, గతంలో బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం విదితమే.. బుడమేరు దెబ్బకు భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి రాగా.. ఇప్పుడు, ముందే అప్రమత్తం అయ్యారు అధికారులు..