Site icon NTV Telugu

Andhra Pradesh: వాహనదారులకు గమనిక.. అమల్లోకి కొత్త నిబంధనలు

ఏపీలో వాహనదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇకపై ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడానికి వీలుంటుంది. కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా కట్టాల్సి ఉంటుంది. అర్హత లేని వారికి డ్రైవింగ్ చేసే అవకాశం ఇస్తే రూ.5వేలు ఫైన్ పడుతుంది. ఇలా ట్రాఫిక్ జరిమానాలను భారీగా ఏపీ ప్రభుత్వం పెంచేసింది.

ఈ నిబంధనలపై గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020, అక్టోబర్ 21న ఉత్తర్వులు ఇవ్వగా.. కరోనా కారణంగా ఇన్నాళ్లూ మిహాయింపు ఇస్తూ ఆ గడువును పెంచుతూ వచ్చారు. అయితే తాజాగా కొత్త నిబంధనలు అమలు చేస్తామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రవాణాశాఖ కొద్దిరోజులుగా భారీస్థాయిలో జరిమానాలను విధిస్తుండగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసిన మేరకే తాము జరిమానాలను విధిస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో పోలీసులకు రూ.100, రూ.150 ఇస్తే వాహనదారులను వదిలేసేవారు. కానీ ఇప్పుడు వాహనదారుల పప్పులు ఉడికేలా కనిపించడం లేదు.

Exit mobile version