నెల్లూరు కోర్టులో కీలక పత్రాల చోరీ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసు వివరాలను తాజాగా నెల్లూరు ఎస్పీ విజయారావు మీడియాకు వెల్లడించారు. శాస్త్రీయంగా పరిశోధన చేసి ఈ కేసును ఛేదించామని తెలిపారు. అన్నింటికీ డిజిటల్ ఆధారాలు ఉన్నాయన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే విచారణ అధికారికి ఇవ్వొచ్చన్నారు. ఈ కేసులో ఈ రాజకీయ నాయకుల ప్రమేయం లేదని నెల్లూరు ఎస్పీ విజయారావు తెలిపారు.
కాగా నెల్లూరు కోర్టులో చోరీ జరిగిన ప్రాంతాన్ని సాంకేతిక అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఇప్పటివరకు లభించిన ప్రాథమిక ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. కోర్టుకు సమీపంలోని శ్రీ ఉమమహేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే దొంగలు ఈ చోరీ కోసం 4 రోజులపాటు రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే చోరీ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
