పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసే పనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యం జరిగినా.. పనుల్లో జాప్యం జరగకుండా చ్యలు తీసుకుంటున్నారు. అయితే, పోలవరం పునరావాస పనులపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించింది నేషనల్ ఎస్టీ కమిషన్.. పోలవరం ముంపు ప్రాంతాల్లో గిరిజనుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.. పోలవరం బాధితుల నుంచి నేషనల్ ఎస్టీ కమిషనుకు 203 ఫిర్యాదుల వరకు అందాయి..
ఇక, తమ పర్యటనపై జాతీయ ఎస్టీ కమిషన్ అనంత్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పునరావాసంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.. పోలవరం బాధితులకు పరిహారం అందలేదు, కాలనీల్లో వసతులూ పూర్తి కాలేదన్న ఆయన.. 2022 నాటికి ముంపు పెరగనుంది.. అయినా ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. గిరిజన రైతులకూ పరిహారం అందించలేదని.. గిరిజనులు తమ సంస్కృతి కోల్పోతున్నారన్న అనంత్ నాయక్.. ప్రాజెక్టు పరిధిలో గిరిజనులకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.. కానీ, ఇప్పటికి అందించలేదన్నారు.. పునరావాస కాలనీలో విద్యా, వైద్యం, కోసం ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించిన ఆయన.. ప్రాజెక్టు పరిధిలో ఉన్న గిరిజన సమస్యలపై అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.. ప్రాజెక్టులో గిరిజనులకు అన్యాయం జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం అన్నారు అనంత్ నాయక్.