Site icon NTV Telugu

Nara Lokesh: 22 మంది ఎంపీలు ఉన్నారు.. విశాఖ ఉక్కుపై మాట్లాడలేరా?

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేద‌ని ప్రక‌టించిన కార్మికులు అదే స్ఫూర్తితో పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి ఏడాది గ‌డుస్తోన్న నేప‌థ్యంలో దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు.

ఏడాదిగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు కార్మికుల‌కు ఉద్యమాభివంద‌నాలు చేస్తున్నాన‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ విష‌యంపై పార్లమెంటు వ‌ర‌కు త‌మ పార్టీ నిర‌స‌న గ‌ళం వినిపిస్తూనే ఉంద‌ని తెలిపారు. విశాఖ ఉక్కుపై వైసీపీ ఎంపీలు మాట్లాడ‌ట్లేదని ఆయ‌న ఆరోపించారు. 22 మంది ఎంపీలను కలిగి ఉన్న ఆ పార్టీ విశాఖ ఉక్కుపై మాట్లాడలేరా అని నారా లోకేష్ నిలదీశారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పాటై, వేలాది మందికి ఉపాధి కల్పతరువుగా మారిన విశాఖ ఉక్కుని కాపాడటానికి సీఎం జగన్, వైసీపీ ఎంపీలు ప్రయత్నం చేయకుండా చేతులెత్తేయడం బాధాకరమన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఉక్కు ప‌రిశ్రమ‌ను కాపాడుకుంటామ‌ని నారా లోకేష్ తెలిపారు.

Exit mobile version