Site icon NTV Telugu

Nara Lokesh: వైసీపీ హయాంలో మద్యం ఆదాయం పెరిగిన మాట వాస్తవం కాదా?

ఏపీ సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. టీడీపీని చూస్తేనే జగన్ భయపడుతున్నారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మద్యం పాలసీపై జగన్ ప్రకటన చేశారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఉండే వాస్తవాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మద్య నిషేధంపై ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని రూ.22వేల కోట్లకు పెంచిన మాట వాస్తవం కాదా అని లోకేష్ ప్రశ్నించారు. మద్య నిషేధంపై మాట తప్పి మడమ తిప్పినందుకు రాష్ట్ర మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు.

జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కల్తీ సారా దొరికిన మాట నిజం కాదా అని నారా లోకేష్ నిలదీశారు. సీఎం సొంత నియోజకవర్గంలో కల్తీ సారా దొరికితే.. మిగిలిన 174 నియోజకవర్గాల్లో దొరక్కుండా ఉంటుందా అన్నారు. కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యంపై ప్రజా చైతన్య ఉద్యమం చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు. సభలో మద్యం, కల్తీ నాటు సారాపై ప్రకటనలిచ్చి పారిపోవడం కాదు.. ధైర్యం ఉంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలుగు మహిళలు త్వరలోనే బెల్టు షాపులను ధ్వంసం చేస్తారని హెచ్చరించారు.

రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యం సీసాలలో రసాయనాలు ఉన్నాయని సభలో సీఎం ఒప్పుకున్నారని.. ప్రాణాలు తీసే సైనేడ్ ఎంత మోతాదులో ఉన్నా నష్టమే అని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఏ జే బ్రాండ్ మద్యం దుకాణానికి వెళ్లినా మద్యం బాటిళ్లలో రసాయనాలు ఉన్నాయని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏ సీఎం కూడా జగన్ తరహాలో అప్పు తీసుకురాలేదని లోకేష్ ఆరోపించారు.

https://ntvtelugu.com/cm-jagan-comments-on-alcohol-polocy-in-ap-assembly/
Exit mobile version