ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మరోసారి లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈసారి గ్రామపంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ.1,309 కోట్లు తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం ఈ మూడు మార్గాల ద్వారానే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులని దారి దోపిడీ దారుల్లా తరలించుకుపోవడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయానని ఆరోపించారు.
Read Also: ఒమిక్రాన్ వేరియంట్.. రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన
కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా ఇచ్చిన రూ.1,309 కోట్లను పంచాయతీ ఖాతాల నుంచి మళ్లించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు నారా లోకేష్.. సర్పంచ్, వార్డుసభ్యులకు తెలియకుండా, పంచాయతీ బోర్డు తీర్మానం లేకుండా నిధులను మళ్లించడం మోసమేనన్న ఆయన.. పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మళ్లించి స్థానిక ప్రజా ప్రతినిధులని మోసం చేశారని ఆరోపించారు. రాజకీయాధిపత్యం కోసం ప్రకటించిన ఏకగ్రీవాల పారితోషికం పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. కాగా, ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ వస్తున్న నారా లోకేష్.. కొన్ని అంశాలపై సీఎం వైఎస్ జగన్‌కు లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే.