Site icon NTV Telugu

Nara Lokesh: ఏపీలో జగన్ వైరస్‌కు చంద్రబాబే వ్యాక్సిన్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: విజయవాడలో చిరు వ్యాపారులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చిరు వ్యాపారులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్‌ను ఎదుర్కోలేకపోతున్నామని లోకేష్ చురకలు అంటించారు. ఏపీలో జగన్, అతని చుట్టుపక్కల ఉన్న నలుగురిదే రాజ్యం నడుస్తోందని.. జగన్‌తో పాటు పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ టెన్త్ పాస్ అయినా డిగ్రీ ఫెయిల్ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వ్యాపార రంగ సంస్థల యజమానులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని.. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే చిరు వ్యాపారులపై దాడులు చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కూడా దాపురించిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు ఇంత దారుణంగా లేవని గుర్తుచేశారు.

Read Also: YSR Nethanna Nestam: ఏపీలో నేతన్నలకు శుభవార్త.. ఈనెల 23న అకౌంట్లలో రూ.24వేలు జమ

అటు రాష్ట్రంలో కార్పొరేషన్లు లేవని.. వాటికి ఛైర్మన్‌లు మాత్రం ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఆక్వా రంగాన్ని జగన్‌రెడ్డి సంక్షోభంలో పడేశాడని.. రాష్ట్రంలో మద్యం తాగితే ఆరు నెలల్లో చనిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దొరకట్లేదు అని.. మన రాష్ట్ర ఇసుక తమిళనాడు, కర్ణాటకలకు వెళ్తుందని విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చెందాలి కానీ పరిపాలన ఒకే చోట ఉండాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. 8 కోట్లు ఖర్చుపెట్టి సీఎం జగన్ దావోస్ వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు. సిగ్గుతో దక్షిణ భారతదేశంలో బతుకుతున్నామని.. పక్క రాష్ట్రాల వాళ్ళు జగన్‌ను తుగ్లక్ అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. జగన్‌కు శాశ్వత హాలీడే పలికే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వైసీపీ ఎంపీల మాదిరి తమ ఎంపీలను ఢిల్లీలో తాకట్టు పెట్టలేదని.. ఏపీలో రోడ్ల గురించి కేటీఆర్, హరీష్‌రావు, చినజీయర్ స్వామి కూడా విమర్శించారని లోకేష్ గుర్తుచేశారు. జగన్ వైరస్‌ను చూసి ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలోకి రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే చిరు వ్యాపారులపై వైసీపీ వేసిన పన్నులు రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ వైరస్‌కు వాక్సిన్ చంద్రబాబే అని స్పష్టం చేశారు.

Exit mobile version