NTV Telugu Site icon

కోవిడ్ త‌గ్గే వ‌ర‌కు స్కూళ్ల‌కు సెల‌వులు ఇవ్వండి..!

క‌రోనా మ‌హ‌మ్మారి విద్యా వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావాన్నే చూపుతోంది.. కోవిడ్ దెబ్బ‌కు కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి.. మ‌రికొన్ని రాష్ట్రాల్లో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి కొన‌సాగుతున్నా.. విద్యాసంస్థ‌లు న‌డుస్తూనే ఉన్నాయి.. అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఒక‌టి.. అయితే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇత‌ర సిబ్బంది వ‌రుస‌గా కోవిడ్ బారిన‌ప‌ప‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.. దీనిపై ఏపీ ప్ర‌భుత్వానికి కీల‌క సూచ‌న‌లు చేశారు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్.. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచ‌ర్ల‌ ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. అనాలోచిత నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అంటూ ఆందోళనకు గురిచెయ్యడం మంచిది కాదంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా హిత‌వుప‌లికారు.

అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామంటున్న విద్యాశాఖ మంత్రి స్కూళ్ల‌లో క‌రోనా కేసుల‌పై ఏం స‌మాధానం ఇస్తారు? అంటూ నిల‌దీశారు నారా లోకేష్.. ఒక్క రోజునే కర్నూలులో 75 మంది విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారంటే ప్రభుత్వం ఏ మేర చర్యలు తీసుకుందో అర్థమవుతోంద‌ని ఎద్దేవా చేశారు. ఇవాళ అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వారు పడుతున్న ఇబ్బందులు గురించి తెలుసుకున్నారు.. ఆ త‌ర్వాత కరోనా ఉదృతి తగ్గే వరకూ ఇతర రాష్ట్రాల మాదిరిగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాల‌ని డిమాండ్ చేశారు నారా లోకేష్‌.